telangana
శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ.. ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
మేడిపల్లి, మేజర్ న్యూస్: బోడుప్పల్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కందుల అనూప్ (17) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని అభయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.పెద్దపల్లి జిల్లా ఓదెడు గ్రామానికి చెందిన అనూప్ శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యశ్వంత్ సింగ్, రణధీర్‌తో పాటు మరో విద్యార్థి అతడిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల మధ్య డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమని సమాచారం. పండుగ సెలవుల అనంతరం కళాశాలకు తిరిగి వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో హాస్టల్‌లో భద్రత, విద్యార్థుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గాయపడిన విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి సీఐ డి. జలంధర్ రెడ్డి తెలిపారు.కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు మానస, శ్రీనివాస్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థిపై దాడికి గల కారణాలు, ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.