శంషాబాద్‌లో ఇన్నోవా కారు బీభత్సం.. మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి పల్టీలు, ఒకరికి తీవ్ర గాయాలు!
సూర్య క్రైమ్ బ్యూరో, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి నర్కూడ వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న టయోటా ఇన్నోవా కారు ప్రమాదకర మలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న కాంపౌండ్ వాల్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టి గాల్లోకి లేచి పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ భయానక ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, వాహనంలో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడిని వాహనం నుంచి బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద తీవ్రత అంతా సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. వాహనం మలుపు తిరిగే సమయంలో వేగాన్ని నియంత్రించలేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.