ఢిల్లీలో మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు: అఖండ దీపం వందేళ్ల సంబరాలు
సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ:అఖిల విశ్వ గాయత్రీ పరివార్ వ్యవస్థాపకురాలు, పరమ వందనీయ మాతా భగవతీ దేవి శర్మ జన్మ శతాబ్ది ఉత్సవాలు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 1926లో వెలిగించిన 'అఖండ దీపం' శతాబ్ది ఉత్సవాలతో పాటుగా జరుగుతున్న ఈ మూడ్రోజుల వేడుకలను ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వేలాది మంది గాయత్రీ పరివార్ సాధకులు, ప్రతినిధులు, ప్రముఖులు ఈ చారిత్రక వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ ప్రొ-వైస్ ఛాన్సలర్ డాక్టర్ చిన్మయ్ పాండ్యా మాట్లాడుతూ, వందనీయ మాతాజీ స్మారకార్థం సమాజ నిర్మాణాన్ని, మహిళా జాగృతిని కాంక్షిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ఆధునిక సమాజానికి అనుసంధానించడంలో మాతా భగవతీ దేవి చేసిన సేవలు అజరామరమని పేర్కొన్నారు. ఈ శతాబ్ది మహోత్సవంలో భాగంగా సాధనను సేవతో, విలువలను ఆచరణతో అనుసంధానిస్తూ సరికొత్త సంకల్పం తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
ఈ ఉత్సవాల్లో అఖిల విశ్వ గాయత్రీ పరివార్ కార్యకర్తల సమ్మేళనం, ప్రత్యేక స్మారక నాణెం, ప్రత్యేక తపాలా బిళ్ళ ఆవిష్కరణ వంటి విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ జ్యోతి కలశ యాత్రలను నిర్వహించి అఖండ దీపం ప్రాధాన్యతను, యుగ నిర్మాణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహిళా సాధికారత, విలువల పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ శతాబ్ది ఉత్సవాలు ఆధ్యాత్మిక రంగంలో సరికొత్త నూతనోత్తేజాన్ని నింపుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.