నర్సాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీ..
సూర్య న్యూస్ బ్యూరో, నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన, మాట్రేవు గ్రామ శివారులో కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో నేలకొరిగిన కొబ్బరి తోటను గమనించారు. వెంటనే తన వాహన శ్రేణిని ఆపాలని ఆదేశించిన ముఖ్యమంత్రి, స్వయంగా కారు దిగి పంట పొలాల్లోకి నడిచి వెళ్లారు.
తుఫాన్ ఈదురుగాలులకు విరిగిపడిన, వేర్లతో సహా కూలిపోయిన కొబ్బరి చెట్లను, తీవ్రంగా దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు. అక్కడే ఉన్న తోట రైతుతో మాట్లాడి నష్ట తీవ్రతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి పెంచిన కొబ్బరి చెట్లు నేలమట్టం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతుకు ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో ప్రభుత్వం అన్నదాతలకు పూర్తి అండగా ఉంటుందని, ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని వెంట ఉన్న వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు సత్వరమే నష్టపరిహారం అందేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేశారు. తోటల పునరుద్ధరణకు సాంకేతిక సహాయంతో పాటు అవసరమైన సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తమ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం పట్ల స్థానిక రైతాంగం కృతజ్ఞతలు వ్యక్తం చేసింది.