శంషాబాద్‌లో బియ్యం ధరలకు రెక్కలు.. కిలో రూ.150–200
నిత్యావసరాల ధరలతో సామాన్యుడిపై ధరల పిడుగు.. అధికారుల హెచ్చరికలు బేఖాతర్!
జీహెచ్‌ఎంసీ శంషాబాద్ పరిధిలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, జొన్నలు, పప్పుధాన్యాల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులతో కుటుంబాలు సతమతమవుతుంటే, మరోవైపు కొందరు రిటైల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిలో బియ్యం రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినియోగదారులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ కొందరు వ్యాపారులు ధరలు పెంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జొన్నల ధరలు సైతం కిలో రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయని చెబుతున్నారు. ఇక పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల గురించి చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ వంటింటి ఖర్చులు పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. సామాన్యుడి కంచంలో అన్నం పెట్టడమే భారంగా మారే పరిస్థితి నెలకొంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్చరికలు కాగితాలకే పరిమితమా?
కిలో ధర రూ.100 దాటితే చర్యలు తీసుకుంటామని పారిశ్రామిక శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యాపారులు అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడిందా? తనిఖీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయా? అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
నిత్యావసర సరుకుల కొరత ఉందనే భయాందోళనలు సృష్టించి, నిల్వలను దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే అక్రమ వ్యాపారులపై అధికారులు నిఘా పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బియ్యం, జొన్నలు, పప్పుధాన్యాల నిల్వలు, సరఫరా, విక్రయ ధరలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ధరల నియంత్రణలో అధికారులు విఫలమైతే నష్టపోయేది సామాన్య ప్రజలే. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు నిద్రమత్తు వీడి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, వాస్తవ ధరలను పరిశీలించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని శంషాబాద్ ప్రజలు కోరుతున్నారు. ప్రజల అవసరాలను వ్యాపార లాభాలకు బలిచేయకుండా, నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ శంషాబాద్.