సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు
హైదరాబాద్, సూర్య ప్రతినిధి : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సాంకేతిక సమస్య కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే లైన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో సికింద్రాబాద్–విజయవాడ, విశాఖపట్నం–తిరుపతి మార్గాల్లో నడిచే పలు రైళ్లు నిలిచిపోయాయి.
మౌలాలి దాటిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్ గంటకు పైగా నిలిచిపోయింది. సికింద్రాబాద్ వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కూడా నిలిపివేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
సాంకేతిక సమస్య కారణంగా శాతవాహన, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లను డీజిల్ ఇంజిన్ల సహాయంతో ముందుకు నడిపించారు. అనంతరం రైల్వే అధికారులు తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.