telangana
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై
సూర్య రాజంపేట : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత, విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకొని సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై భువనేశ్వర్ సూచించారు. అదేవిధంగా మత్తు పదార్థాలకు (డ్రగ్స్) దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాజంపేట బాలుర ఉన్నత పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణలో పోలీసుల పాత్ర, యువత, విద్యార్థుల బాధ్యతలు, మత్తు పదార్థాల నిర్మూలనలో పోలీసుల పాత్ర, విద్యార్థుల రక్షణ వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై భువనేశ్వర్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారం, ఈమెయిల్ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, ఆన్లైన్లో వచ్చే మోసపూరిత సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా చదువుపై దృష్టి సారించాలని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడంలో పోలీసులతో పాటు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.విద్యార్థుల్లో చదువుల ఒత్తిడి, పరీక్షల్లో ర్యాంకులు సాధించాలనే భయం, వ్యక్తిగత సమస్యలు మానసిక ఆందోళనకు కారణమవుతాయని, అలాంటి పరిస్థితుల్లో చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల సలహాలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో మెంటార్షిప్, కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని కల్పించాలని తెలిపారు. అలాగే విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు, యోగా, సంగీతం, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
విద్యార్థులు సైబర్ నేరాలు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకొని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయాలని ఎస్సై భువనేశ్వర్ కోరారు. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్, ఉపాధ్యాయులు ఆకుల బాబు, సంతోష్ కుమార్, శ్రీవిద్య, శ్రీలత, సురేందర్, విజయ చందన, సునీత పాల్గొన్నారు.