రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మెడికవర్ 10 కి.మీ. సైక్లోథాన్ ‘పెడల్ ఎగైనెస్ట్ క్యాన్సర్’తో ముందస్తు గుర్తింపుపై అవగాహన
హైదరాబాద్,మేజర్ న్యూస్ ప్రతినిధి : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, వ్యాధిని ముందస్తు దశలో గుర్తించడం ప్రాముఖ్యతను చాటిచెప్పే లక్ష్యంతో మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం 10 కిలోమీటర్ల సైక్లోథాన్ నిర్వహించారు. బైక్-ఓ-హోలిక్స్ సైక్లింగ్ కమ్యూనిటీ సహకారంతో పింక్ అక్టోబర్‌లో భాగంగా ‘పెడల్ ఎగైనెస్ట్ క్యాన్సర్’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ధాస్యం గీతా భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. రొమ్ములో గడ్డలు, ఆకృతిలో మార్పులు, చనుమొనలో అసాధారణ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, సకాలంలో చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రారంభమైన సైక్లోథాన్ జీటీ రెడ్డి సర్కిల్, నానక్‌రామ్‌గూడ సర్కిల్, నార్సింగి సర్వీస్ రోడ్, ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్, విప్రో సర్కిల్ మీదుగా తిరిగి ఆసుపత్రి వద్ద ముగిసింది.
కార్యక్రమంలో ఆంకాలజిస్టులు డా. పృథ్వీ రాజ్, డా. కవిత నారగోని, డా. రవి కృష్ణ మాడాల, మెడికవర్ సెంటర్ హెడ్స్ డా. స్వరూప్, శరత్ చంద్రతో పాటు పలువురు వైద్యులు, సైక్లింగ్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.