*రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి*
కంది;రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులను కోరారు. కంది మండల కేంద్రంలో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో రైతులందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని, ఎలాంటి దళారీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించాలని సూచించారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను తప్పనిసరిగా అందించాలని, గత ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను సైతం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ ఏడాది రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, పంట రుణాలు, ఎరువుల కొరత వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని, ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.కొనుగోలు కేంద్రంలో రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైతు బీమా పరిహారాన్ని అర్హులైన రైతులందరికీ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని, అన్నదాతకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చూడాలని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కృష్ణ గౌడ్, ఖాజా ఖాన్, మోహన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, నందకిశోర్, సాయి గౌడ్, ఆనంద్ రావు, దశరథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.