telangana
రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ
సూర్య, మందమర్రి: భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో రాజ్యాంగ పీఠిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను స్వయంగా పఠించి, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో సామూహికంగా చదివించారు. రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి పి. కృష్ణప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వసంత్, వార్డు అధికారులు, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.