ప్రతి పనికి గడువు విధించి.. వేగంగా పూర్తి చేయాలి* *వీటీఏడీఏ వైస్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య .. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో ప్రతి దానికి గడువు విధించి.. వేగంగా పూర్తి చేయాలని వీటీఏడీఏ వైస్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వేములవాడ పట్టణంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆద్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులపై వీటీఏడీఏ వైస్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి శుక్రవారం ఆర్ అండ్ బీ, దేవాదాయ శాఖ, ఎన్ పీ డీ సీ ఎల్, వేములవాడ మున్సిపల్ అధికారులతో ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రతి పనికి సంబంధించి ప్రత్యేకంగా కూలీల సంఖ్య పెంచాలని, పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ అధికారులు నిత్యం అభివృద్ధి పనులను పరిశీలిస్తూ.. వేగంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనుల్లో మిగతావి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.