ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
మెదక్ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశంలోనే ఒక వినూత్న కార్యక్రమమని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.శుక్రవారం, మెదక్ జిల్లాలోచేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమానికికలెక్టర్ హాజరై, లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఈ పథకం వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఈ పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు.
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ముఖ్య ఉద్దేశం*
సాధారణంగా ఎల్‌ఐసీ వంటి జీవిత బీమా పథకాల కోసం ప్రజలు ప్రతి ఏటా సొంతంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద రాష్ట్రంలోని కోటి పైచిలుకు కుటుంబాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. తద్వారా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వర్తింపజేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని సూచించారు.
*అర్హత వయసు*
18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న కుటుంబ సభ్యుల పేరు మీద బీమా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డులో ఉన్న తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారని, క్యాంపులకు వచ్చే ముందు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు.
*అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపు*
ఈ పథకంలో పేద, ధనిక, ఏపీఎల్, బీపీఎల్ అనే తేడాలు లేవని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రైతు బీమా ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని, రైతు బీమాతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
*నామినీ ఎంపిక లబ్ధిదారుడిదే*
బీమా ద్వారా వచ్చే మొత్తాన్ని (ఉదాహరణకు రూ.5 లక్షలు) ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని తెలిపారు. పిల్లల పేరు మీద గానీ, భార్యాభర్తల పేరు మీద గానీ, ఇద్దరు పిల్లలు ఉంటే 50-50 శాతం (లేదా) ఇతర విధంగా తమ ఇష్టానుసారం వాటాలను కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవచ్చని వివరించారు.ఈ గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు ఉంటే దానిని సమర్పించాలని, లేని పక్షంలో అందుబాటులో ఉన్న ఫారాన్ని పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు.ప్రతి ఒక్కరూ తమ ఫారంలో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని, అనంతరం నమోదు చేసిన వివరాలను మరోసారి సరిచూసుకోవాలని తెలిపారు.గతంలో రైతు బీమా నమోదు చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో నిర్దేశించిన వ్యవధి లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను *కలెక్టర్* ఆదేశించారు. క్యాంపులకు తరలి వచ్చే లబ్ధిదారులకు తగిన వసతులు కల్పించాలని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి Dwo హేమ భార్గవి , ఎంపీడీవో చెన్నారెడ్డి, తాసిల్దార్ బాల లక్ష్మి గ్రామ సర్పంచ్ దుర్గా రామ గౌడ్ ,సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.