జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం - నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో బనగానపల్లె జడ్పీటీసీ సభ్యులు షేక్ బుర్హానుద్దీన్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా, సిరివెళ్ల జడ్పీటీసీ సభ్యులు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యురాలు, జడ్పీటీసీ సభ్యులందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి సూచనలు, సలహాలు తీసుకుని సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. అందరి సహకారంతో జిల్లా పరిషత్ పరిధిలోని ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నూతన వైస్ చైర్మన్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనను సిరివెళ్ల మండల జడ్పీటీసీ సభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన సిరివెళ్ల మండలంలోని గ్రామాల ప్రజలకు, మండల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*