ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి సమర్పించని కారణంగా 2026 జూలై 31న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చోటు చేసుకోని అర్హులైన ఓటర్లకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం తెలిపారు. SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి సమర్పించని ఓటర్లను ఆబ్సెంట్ (గైర్హాజరు), షిఫ్టెడ్ (చిరునామా మారినవారు), డెడ్ (మరణించినవారు), డూప్లికేట్ (ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారు)గా గుర్తించి ASDD జాబితాలో చేర్చినట్లు తెలిపారు. అయితే, నివాస చిరునామాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లు తమ పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
*ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లు*
*ASDD జాబితాలో ఉన్న ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ముద్రించి, సంప్రదింపు వివరాలు అందుబాటులో ఉన్న చోట బూత్ స్థాయి అధికారులు (BLOలు) ద్వారా నేరుగా లేదా వాట్సాప్, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ ప్రస్తుత EPIC నంబర్ ఆధారంగా భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లేదా ECINET యాప్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చన్నారు.
*నివాసం మారని ఓటర్లు సమర్పించాల్సిన పత్రాలు*
తమ నివాస చిరునామాలో ఎలాంటి మార్పు లేని ఓటర్లు సక్రమంగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారం (అనుబంధం-A)తో పాటు స్టేట్‌మెంట్ (అనుబంధం-B)ను సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) లేదా బూత్ స్థాయి అధికారి (BLO)కు స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా భౌతికంగా సమర్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈ-సైన్ సదుపాయాన్ని వినియోగించి ECINET యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చన్నారు.
*రాష్ట్రంలోనే నివాసం మారిన ఓటర్లకు ప్రత్యేక విధానం*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మార్చుకున్న ఓటర్లు ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అటువంటి ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం (అనుబంధం-A), స్టేట్‌మెంట్ (అనుబంధం-C)తో పాటు చెల్లుబాటు అయ్యే చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని తమ కొత్త అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ERO/AEROకు సమర్పించాలని సూచించారు.
*నవంబర్ 30 వరకు ఫారాల స్వీకరణ - డిసెంబర్ 22న తుది జాబితా*
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను 2026 నవంబర్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు సమర్పించిన ఫారాలను పరిశీలించి ఆమోదించిన అనంతరం ఓటర్ల అసలు EPIC నంబర్లలో ఎలాంటి మార్పు లేకుండా 2026 డిసెంబర్ 22న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లను నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. SIR ప్రక్రియ సందర్భంగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ASDD జాబితాలో ఉన్న ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉన్న 'Book a Call with BLO' సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం అందించిన ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లందరూ సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులోగా తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*