BREAKING
బాడంగి జడ్పీటీసీగా కండి ప్రతిమ ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాలు అందజేత ఎమ్మెల్యే పాడె మోసిన సీఎం విజయ్.. విజయనగరం జిల్లా జడ్పీ పీఠం కూటమి కైవసం.. చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవ ఎన్నిక ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ కుటుంబ భీమా ప్రారంభం కొమురం భీం వారసుల కుటుంబానికి జాధవ్ శ్రీకాంత్ పరామర్శ వర్గల్ నవోదయ విద్యాలయంలో బాలికలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్ల పంపిణీ హెబ్బటం గ్రామంలో అలీమ్ బాషా కుటుంబానికి జనసేన పార్టీ అండ గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తమిళ చిత్రం కూడు.. గాలా ప్రీమియర్‌కు ఎంపిక ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా : కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెబ్బటం గ్రామంలో అలీమ్ బాషా కుటుంబానికి జనసేన పార్టీ అండ ఆహార సంక్షోభ ముప్పు ఉన్నా సాయం లక్ష్యం కుదింపు టీడీపీ నుంచి బీ-ఫామ్ కోరింది వాస్తవమే.. రాకపోవడంతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేశా వైస్ ఎంపీపీ మారపు విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టీకరణ 22న గంగవరంలో బిపి, షుగరు, రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఘనంగా ఐఐటీ చుక్కా రామయ్య 101వ జన్మదిన వేడుకలు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా : కలెక్టర్ సి. నారాయణరెడ్డి

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా : కలెక్టర్ సి. నారాయణరెడ్డి

రంగారెడ్డి : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా లేదా సహజంగా మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరున ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చన్నారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని వివరించారు. ఇప్పటికే రైతులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు వివిధ బీమా పథకాలు అమలులో ఉన్నాయని, ఆయా పథకాల పరిధిలోకి రాని కుటుంబాలకు కూడా బీమా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సహా అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక బృందాల ద్వారా నమోదు ప్రక్రియ చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి బృందంలో మండల స్థాయి అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్, హెల్ప్ డెస్క్ ఇన్‌చార్జి ఉంటారని చెప్పారు. నమోదు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుందని, అర్హులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు కుటుంబ సభ్యులు, నామినీల వివరాలను తీసుకొని శిబిరాలకు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో నెల రోజుల్లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించాలని కోరారు.

అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి మరణిస్తే భార్యాపిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. బీమాపై ప్రజల్లో ఉన్న అపోహలు, సంకోచాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు. మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబ సభ్యులు గౌరవంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే జీవిత బీమా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సాధారణంగా జీవిత బీమా కోసం ప్రజలు ప్రతి ఏటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, ఈ పథకంలో కుటుంబ యజమాని పేరున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడం విశేషమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. చేవెళ్ల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు సమత వెంకట్ రెడ్డి, సోనియా, ఆర్డీఓ పార్థసింహారెడ్డి, సీపీఓ సౌమ్య, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వి. శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్