ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్:ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై. మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్ కోరారు. శుక్రవారం మోమిన్‌పేట్ మండల పరిధిలోని చిన్నకొల్కొండ, బూరుగుపల్లి, చంద్రన్‌పల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఇన్‌చార్జి ఎంపీడీవో రాజమల్లయ్యతో కలిసి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఐకేజేబీపీ క్యాంపు ద్వారా అధికారులు పంచాయతీ కార్యదర్శుల లాగిన్‌లో లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ యజమానికి ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 19 వరకు నమోదు చేసుకునే అవకాశం ఉందని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సంజయ్ కుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోస్గి సురేందర్, సర్పంచులు విశాల, సంగమేశ్వర్, వరప్రసాద్ రెడ్డి, శివకుమార్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హషం మహమ్మద్, నాయకులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.