ప్రజలకు నీడనిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార ఫ్లెక్సీలు.. బొంరాస్‌పేట్‌లో ఆసక్తికర దృశ్యం
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: రాజకీయ నాయకుల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి. నాయకుల ఫొటోలతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రచార బ్యానర్లు మండుతున్న ఎండలో ప్రజలకు నీడనివ్వడం బొంరాస్‌పేట్ మండల కేంద్రంలో ఆసక్తికరంగా మారింది.ఇటీవల బొంరాస్‌పేట్‌లో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంతో పాటు ప్రధాన రహదారులు, కూడళ్లలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితర నాయకుల ఫొటోలతో కూడిన బ్యానర్లు ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి.అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగడంతో ఈ ప్రచార ఫ్లెక్సీలు అనూహ్యంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. మండల కేంద్రంలోని ఓ దుకాణం ముందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఎండ వేడి నుంచి రక్షణ కల్పించే నీడగా మారింది. దుకాణం వద్దకు వచ్చే వినియోగదారులు, అటుగా వెళ్లే వాహనదారులు కొద్దిసేపు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఆ ఫ్లెక్సీ నీడను ఆశ్రయిస్తున్నారు.సాధారణంగా రాజకీయ సభలు, సమావేశాలు, నాయకుల పర్యటనల సందర్భంగా ప్రచారం కోసం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు కార్యక్రమాలు ముగిసిన తర్వాత పెద్దగా ఉపయోగంలో ఉండవు. కానీ బొంరాస్‌పేట్‌లో మాత్రం ప్రచారానికి ఉపయోగపడిన బ్యానర్లు ఇప్పుడు ప్రజలకు నీడనిస్తూ కనిపించడం విశేషం. నాయకుల ప్రచార చిత్రాల కింద సామాన్యులు ఎండ నుంచి ఉపశమనం పొందుతున్న దృశ్యం అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది.మొత్తానికి రాజకీయ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజలకు నీడనివ్వడం బొంరాస్‌పేట్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రచారానికి పెట్టిన ఖర్చు ఇలా ప్రజలకు కొంతైనా ఉపయోగపడుతోందంటూ స్థానికులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.