బాక్సాఫీస్ వద్ద 90 కోట్లు కొల్లగొట్టిన తమన్నా ఫాంటసీ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులు ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను వీక్షించే అవకాశం లభించింది.
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ జానపద కథలు, పురాతన విశ్వాసాల నేపథ్యంలో సాగుతుంది. కల్పిత కథలకు భిన్నంగా మన మట్టి వాసన, స్థానిక విశ్వాసాలను ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. అరుణాబ్ కుమార్ తన చిన్ననాటి అనుభవాల ఆధారంగా రాసి, నిర్మించిన ఈ కథ ప్రకృతిని గౌరవించడం, ఆ సమతుల్యతను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలను ఉత్కంఠభరితంగా ఆవిష్కరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా తమ పాత్రల్లో పూర్తి స్థాయిలో ఒదిగిపోయి నటించారని చిత్ర బృందం తెలిపింది.
సినిమా కథ విషయానికి వస్తే, తన పూర్వీకుల భూమిని విక్రయించేందుకు రిషి తన భార్య మమతతో కలిసి సొంత గ్రామానికి వెళ్తాడు. అయితే గ్రామ దేవత వనదేవి రక్షిస్తున్న పవిత్ర అడవి గుండా రహదారి నిర్మించే ప్రతిపాదన రావడంతో అభివృద్ధికి, తరతరాల నమ్మకాలకు మధ్య సంఘర్షణ మొదలవుతుంది. గ్రామస్తుల ఆచారాలను మమత గౌరవిస్తుండగా, నమ్మకాలు లేని రిషి సూర్యాస్తమయం తర్వాత అడవిలోకి వెళ్లకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తాడు. ఆ ఒక్క నిర్ణయం అతడిని ఊహకందని భయానక రహస్యాలు, అతీంద్రియ శక్తుల వలయంలోకి నెడుతుంది.
ఏక్తా కపూర్ నేతృత్వంలోని బాలాజీ టెలిఫిల్మ్స్, టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో 11:11 బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమైంది. ఇందులో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఛఠ్ పూజ సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రానికి సీక్వెల్‌గా ది వాన్ 2ను కూడా అధికారికంగా ప్రకటించడంతో ఈ ఫ్రాంచైజీపై అంచనాలు మరింత పెరిగాయి.
Also Read: భారత్ నాకు ఎప్పటి నుంచో ఒక అద్భుతమైన పౌరాణిక దేశంలా అనిపిస్తుంది: చార్లీ జీర్ ఆసక్తికర వ్యాఖ్యలు