వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువతదే కీలక పాత్ర
సూర్య జాతీయ డెస్క్: దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దే ప్రయాణంలో యువత భుజస్కంధాలపైనే ప్రధాన బాధ్యత ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం 103వ వార్షిక స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పట్టభద్రులు తమ కలలను సాకారం చేసుకుంటూ జీవితకాలం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నేటి యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని, కొత్త సవాళ్లను స్వీకరిస్తూ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు.
దేశంలో ప్రతి ఏటా సుమారు రెండున్నర కోట్ల మంది యువత కళాశాల వయసుకు చేరుకుంటున్నారని, అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే అదృష్టం కొద్దిమందికే లభిస్తుందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. విద్యార్థుల ఈ విజయం వెనుక తల్లిదండ్రుల త్యాగం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో ఉందని కొనియాడారు. తన 104 ఏళ్ల ప్రస్థానంలో 90 కళాశాలలు, ఆరు లక్షలకు పైగా విద్యార్థులతో ఢిల్లీ వర్సిటీ దేశ విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుందని వివరించారు.
పట్టభద్రులు బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తూ జాతీయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పీయూష్ గోయల్ సూచించారు. విభజన ధోరణులకు తావులేని ఐక్య సమాజం ద్వారానే దేశం తన పూర్తి సామర్థ్యాన్ని సాధించగలదని అన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పురోగతిలో యువత ముందుండాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
స్నాతకోత్సవం అనేది కేవలం విద్యాభ్యాసం ముగింపు మాత్రమే కాదని, సమాజానికి సేవ చేస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే కొత్త ప్రయాణానికి నాంది అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. పట్టభద్రుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకొని తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.