national
కేంద్రంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..
ముంబై, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన అధికార పరిధి వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర అధికారాలను హరిస్తూ కేంద్రం సమాంతర వ్యవస్థను సృష్టిస్తోందని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్‌డీఏ) ఈ ఏడాది సెప్టెంబర్ 3న న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తాజాగా ఈ వివాదానికి ముగింపు పలుకుతూ అక్టోబర్ 29న ఆ పిటిషన్‌ను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఈ న్యాయపరమైన వివాదానికి తెరపడింది.