national
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించి 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనమే సమగ్రంగా విచారిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తేల్చిచెప్పింది.
గతంలో ఈ అంశంపై ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వెలువరించిన భిన్న తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ (రీకాల్) దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రీకాల్ దరఖాస్తుతో పాటు రిఫరెన్స్ ఉత్తర్వులపై ఉన్న అభ్యంతరాలను కూడా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనమే పరిశీలిస్తుందని స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) మినహాయిస్తూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కీలక చట్టం చెల్లుబాటుపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది.