మహిళల ఆరోగ్యం సమాజానికి సౌభాగ్యం! డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలోని ఓటేరు కమ్యూనిటీ భవనంలో రాస్ పొదుపు సంఘాల సభ్యులకు ‘మహిళల ఆరోగ్యం–సమాజ వికాసం’ అనే అంశంపై ఆయన అవగాహన కల్పించారు. ప్రాచీన కాలం నుంచి మహిళలను గౌరవించే సమాజంలోనే సౌభాగ్యం వెల్లివిరుస్తుందని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక ఇంటికి ఇల్లాలు దీపమైతే, ఆ కుటుంబ అభివృద్ధికి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మహిళ ఆరోగ్యమే పునాది అని వివరించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుందని, కుటుంబాలు బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన తల్లి పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతుందని, ముఖ్యంగా గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం, తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మహిళల ఆరోగ్యం రాబోయే తరాల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. కుటుంబ బాధ్యతల ఒత్తిడిలో చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రక్తహీనత, పోషకాహార లోపం, ఐరన్, కాల్షియం లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, పీసీఓఎస్ వంటి సమస్యలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతల మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల మహిళలు మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు జీవనశైలిలో మార్పులు మహిళలు ప్రతిరోజూ ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని, వయస్సు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కేవలం వారి వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదని, కుటుంబ సభ్యులు కూడా ఇంటి పనుల్లో సహకరించి వారికి తగిన విశ్రాంతి కల్పించాలని సూచించారు. మహిళలకు అవసరమైన వైద్య సదుపాయాలు, పోషకాహారం, మానసిక ఆరోగ్య సహకారం అందించడం కుటుంబంతో పాటు సమాజ బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత భవిష్యత్ తరాల అభివృద్ధికి పెట్టుబడితో సమానమని, ప్రతి మహిళ తన ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ‘మహిళల ఆరోగ్యం – సమాజానికి సౌభాగ్యం’ అనే నినాదం సార్థకమవుతుందని డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రావు, సత్యనారాయణ, పుష్ప, పతంజలి కృష్ణ, సూర్య కిరణ్, లక్ష్మి, పద్మావతి, భువనేశ్వరి, 150 మంది మహిళలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్