ఢిల్లీలో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం.. 7 వేలు దాటిన బస్సుల సంఖ్య
సూర్య జాతీయ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కొత్త బస్సుల చేరికతో రాజధానిలో మొత్తం బస్సుల సంఖ్య 7 వేల మార్కును దాటింది. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను పెంచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన భద్రత, సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
కొత్తగా చేరిన 100 ఎలక్ట్రిక్ బస్సులతో కలిపి ఢిల్లీలో మొత్తం బస్సుల సంఖ్య సుమారు 7,088కి చేరుకుంది. ఇందులో 5,338 ఎలక్ట్రిక్ బస్సులు కాగా, మరో 1,750 సీఎన్‌జీ బస్సులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు కలిగిన నగరంగా ఢిల్లీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తొమ్మిది మీటర్లు మరియు పన్నెండు మీటర్ల పొడవు గల ఈ బస్సులను కాశ్మీరీ గేట్ ఐఎస్‌బీటీ నుంచి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీలో 15 వేల కోట్ల రూపాయల భారీ ఈవీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన కొనుగోలు సబ్సిడీలతో పాటు పాత బీఎస్-ఫోర్ లేదా అంతకంటే పాత వాహనాలను స్క్రాప్ చేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ నెలలో వాయు నాణ్యత సూచీ క్రమంగా మెరుగుపడుతుండటం ప్రజలు, ప్రభుత్వం పరస్పర బాధ్యతతో వ్యవహరించడం వల్లే సాధ్యమైందని ఆమె అన్నారు.
ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 2028-29 నాటికి మొత్తం బస్సుల సంఖ్యను దాదాపు 14 వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ మధ్య కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను నడిపే ప్రణాళిక కూడా ఉందని అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో మరింత స్వచ్ఛమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.