పామూరు భవిష్యత్తు మార్చాలన్నదే నా తపన
పామూరు, మేజర్ న్యూస్ :
పామూరు పట్టణం తనకు కేవలం నివాస ప్రాంతం మాత్రమే కాదని తన జీవితంతో ముడిపడిన ఊరని ఈ పట్టణం అభివృద్ధి చెందాలన్నదే తన చిరకాల ఆకాంక్షని ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్ . షంషూర్ తెలిపారు. పామూరును పరిశుభ్రత, మౌలిక వసతులు, సకల సౌకర్యాలతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్న తపనతోనే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచానని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డుకు అభివృద్ధి ఫలాలు అందాలన్న సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చానని తన ఆశయానికి పట్టణ ప్రజల ఆశీస్సులు, సహకారం అందించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షంషూర్ విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ మహిళలు, యువకులు, పట్టణ ప్రముఖులను కలుసుకుని తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారానికి వచ్చిన షంషూర్‌కు పలుచోట్ల స్థానికులు ఆత్మీయ స్వాగతం పలుకుతూ మా ఓటు మీకే మీకు మా మద్దతు ఉంటుంది అంటూ భరోసా ఇచ్చారు. ఓటర్ల నుంచి లభించిన ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టిడిపి నేతలు యాదాల వెంకట సాయి కిరణ్,కావిటి సుబ్బయ్య, మాచర్ల రహిమాన్, ఆర్ ఆర్ రఫీ, వాయినేని రాఘవ, షేక్ హాజీ గౌస్, ఉప్పలపాటి హరిబాబు, ఆకుపాటి వెంకటేష్, వరికుటి చిరంజీవి, షేక్ కాజా రంతుల్లా తదితరులు పాల్గొన్నారు.