కొండగట్టు అంజన్న సాక్షిగా.. ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచే శక్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేస్తున్న సూచనలు, హెచ్చరికలను ప్రజలు బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.శుక్రవారం కొండగట్టులో నిర్వహించిన ఆంజనేయ స్వామి చందనోత్సవం సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ నర్సింగరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలకు ఒకసారి జరిగే చందనోత్సవంలో పాల్గొనడం, ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం చేసుకోవడం తనకు లభించిన గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రికి ఆంజనేయ స్వామి అపారమైన శక్తి, కొండంత ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రపంచానికి సవాలుగా మారిన ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ముందస్తుగా జారీ చేస్తున్న సూచనలు, మార్గదర్శకాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి అవసరమైన ప్రత్యేక నిధులు సాధించేందుకు కృషి చేస్తానని స్పీకర్ వెల్లడించారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కొండగట్టులో స్వయంభువుగా వెలసిన ఆంజనేయ స్వామి చందనోత్సవంలో పాల్గొనడం, స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం గత జన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడుతూ ఆలయాల విశిష్టతను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు పలు ప్రముఖ ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో కొండగట్టు ఆలయ ప్రాంత అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.