‘రామాయణ’ ఒక ఎజెండా సినిమా.. రావణుడిని హీరోలా చూపించారు: నటుడు నితీశ్ భరద్వాజ్ తీవ్ర విమర్శలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై ప్రముఖ నటుడు నితీశ్ భరద్వాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ చోప్రా మహాభారతం సీరియల్‌లో శ్రీకృష్ణుడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ఈ సినిమాను ఒక ఎజెండా చిత్రంగా అభివర్ణించారు. ట్రైలర్ విడుదలైన సమయంలో సినిమాపై ప్రశంసలు కురిపించినప్పటికీ, పూర్తి సినిమా చూసిన తర్వాత తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, గతంలో చేసిన ప్రశంసలను వెనక్కి తీసుకుంటున్నట్లు నితీశ్ భరద్వాజ్ స్పష్టం చేశారు.
సినిమాలో శ్రీరాముడి పాత్రను చిత్రీకరించిన తీరుపై నితీశ్ భరద్వాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు అంటే మర్యాద, రఘుకుల సంప్రదాయాలకు ప్రతీక అని, కానీ ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ పోషించిన రాముడి పాత్రను భావోద్వేగాలు లేని సాధారణ వ్యక్తిగా తగ్గించి చూపించారని ఆయన విమర్శించారు. అయోధ్యను వీడి అడవులకు వెళ్లే సమయంలో రాముడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించడం ఇక్ష్వాకు వంశ గౌరవానికి విరుద్ధమని అన్నారు.
అంతేకాకుండా యశ్ పోషించిన రావణుడి పాత్రలో ఎలాంటి ప్రతికూల అంశాలను చూపించకుండా ఒక హీరోలా, ఉదారవాదిగా, సమానత్వం కోరుకునే నాయకుడిలా చూపించారని నితీశ్ మండిపడ్డారు. విలన్‌ను హీరోగా, హీరోను బలహీనంగా చూపిస్తే రెండో భాగంలో రాముడు రావణుడిని సంహరించే సన్నివేశాన్ని యువతరం ఎలా అర్థం చేసుకుంటుందని ప్రశ్నించారు. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విదేశాల నుంచి నిధులు వచ్చాయని ఆరోపిస్తూ, దీని వెనుక ఉన్న మనీ ట్రైల్‌పై ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు నితీశ్ భరద్వాజ్ కంటే ముందే సీనియర్ నటులు ముఖేశ్ ఖన్నా, సునీల్ లహరి కూడా ఈ చిత్రంలోని పాత్రల చిత్రీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయి పల్లవి పోషించిన సీతాదేవి పాత్రను కత్తి పట్టుకునే యోధురాలిగా చూపించడంపై వారు అభ్యంతరం తెలిపారు. ఒకవైపు వివాదాలు, విమర్శలు కొనసాగుతున్నప్పటికీ ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1,500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది.
Also Read: ఈషా సింగ్తో బ్రేకప్ పుకార్లు, ఆరోపణల వేళ.. ప్రైవసీ కోరిన అవినాష్ మిశ్రా