ఈషా సింగ్‌తో బ్రేకప్ పుకార్లు, ఆరోపణల వేళ.. ప్రైవసీ కోరిన అవినాష్ మిశ్రా
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హిందీ బుల్లితెర నటుడు అవినాష్ మిశ్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న పుకార్లు, ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నటి ఈషా సింగ్‌తో విడిపోయారనే వార్తలు, మోసం ఆరోపణలు నెట్టింట జోరుగా ప్రచారం అవుతున్న వేళ అవినాష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఓ నోట్ పంచుకున్నారు. గత కొద్ది వారాలు చాలామందికి కష్టతరంగా గడిచాయని, ఈ విషయాన్ని పక్కన పెట్టి ముందుకు సాగుదామని ఆయన పేర్కొన్నారు. సంబంధాలు వ్యక్తిగతమైనవని, అవి పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదని, ప్రతిదానికీ వ్యూస్, ఎంగేజ్‌మెంట్ కోసం చూడకూడదని, ప్రతి ఒక్కరి ప్రైవసీని గౌరవించాలని మీడియా పేజీలు, నెటిజన్లను అవినాష్ కోరారు.
బిగ్ బాస్ 18 ద్వారా పరిచయమై స్నేహితులుగా మారిన అవినాష్ మిశ్రా, ఈషా సింగ్ ఇటీవలే తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఖత్రోం కే ఖిలాడీ 15 విజయం అనంతరం జరిగిన వేడుకల్లో అవినాష్ తన ప్రేమను వెల్లడించిన వీడియోలు వైరల్ కాగా, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ రియాలిటీ షోలోనూ కనిపించారు. అయితే అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి.
విడిపోతున్నారనే ఊహాగానాల మధ్య ఈషా సింగ్ ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి ప్రశాంతత కోరుకున్నట్లు సమాచారం. ఈ వివాదంలో వేరొకరి పేరు కూడా సోషల్ మీడియాలో వినిపించడంతో సంబంధిత వ్యక్తులు సైతం తమ వ్యక్తిగత జీవితాలపై అనవసర ఊహాగానాలు ఆపాలని కోరారు. ఈ పరిణామాలపై ఈషా సింగ్ ఇంకా అధికారికంగా స్పందించకపోగా, అవినాష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం టెలివిజన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: డైరెక్ట్ ఓటీటీలోకి నివేదా థామస్ ‘శ్రీమతి’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు చేసిన జీ5