telangana
రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ఎందుకు..? - దీపావళి లాభాల వాటా వెంటనే చెల్లించాలి - సీఐటీయూ డిమాండ్
సూర్య, మందమర్రి : సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో పదవీ విరమణ చేసిన కార్మికులకు కూడా సముచిత వాటా కల్పించాలని సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి డిమాండ్ చేశారు. సంస్థకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి, ఉత్పత్తి అభివృద్ధిలో భాగస్వాములైన రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా దీపావళి బోనస్ చెల్లించకపోవడం అన్యాయమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేస్తున్న కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తున్న యాజమాన్యం, పదవీ విరమణ చేసిన వారిని కూడా అదే విధంగా గుర్తించాలని కోరారు. క్వార్టర్ ఖాళీ చేసినప్పుడే చెల్లింపులు చేస్తామంటూ నిబంధనల పేరుతో జాప్యం చేయకుండా వెంటనే బోనస్ అందించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ కార్మికుల వైద్య పథకం సీపీఆర్‌ఎంఎస్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. గతంలో ప్రకటించిన రిటైర్డ్ కార్మికుల సొంతింటి పథకానికి సంబంధించి కూడా ఎలాంటి విధివిధానాలు వెల్లడించలేదన్నారు. ఈ కారణంగా పలువురు పదవీ విరమణ చేసిన కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేయలేక గ్రాట్యుటీ ప్రయోజనాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఇకనైనా స్పందించి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా బోనస్ చెల్లించడంతో పాటు వైద్య సౌకర్యాల పెంపు, సొంతింటి పథకాన్ని తక్షణమే అమలు చేయాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు.