telangana
ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య, ఆదిలాబాద్ : జిల్లాలోని 24 పీఎంసీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఈఎంఓతో కలిసి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన మైసూర్‌లోని ఆర్ఐఐ (RII), బెంగళూరులోని ఐఐఎం (IIM) సందర్శనకు సోమవారం బయలుదేరారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో పర్యటనకు వెళ్లే బస్సును జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శనతో ప్రధానోపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ, నాయకత్వ లక్షణాలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో నేర్చుకున్న నూతన విధానాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసి, విద్యార్థుల సమగ్ర వికాసానికి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 17న మైసూర్‌లోని ఆర్ఐఐలో ఆంగ్ల భాష బోధనలో ఆధునిక పద్ధతులు, పిల్లలకు సులభంగా ఆంగ్లం నేర్పించే విధానాలపై శిక్షణ పొందనున్నారు. అలాగే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాల పెంపునకు అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. 18న బెంగళూరులోని ఐఐఎంను సందర్శించి, పాఠశాలలకు, సమాజానికి మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, సమాజ భాగస్వామ్యాన్ని పాఠశాల విద్యలో పెంపొందించడం, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. అనంతరం అదే రోజు ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ఎస్ఎఫ్ఈఓ అశోక్, సెక్టోరల్ అధికారులు, డీవైఎస్ఓ దయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.