BREAKING
మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్! పుణె హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరిన అమిత్ షా! ఆముదం పంట విత్తుకోవడం శ్రేయస్కరం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి కృష్ణవంశీతో విడాకుల పుకార్లు.. పెళ్లి ఓవర్‌రేటెడ్ అంటూ రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు! సమాజానికి దిక్సూచి పాత్రికేయులు... అజిత్ కుమార్‌కు విలన్‌గా శివరాజ్ కుమార్.. 'డేర్ డెవిల్' మూవీపై క్రేజీ అప్‌డేట్! బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం: కదలికలపై ఏపీఎస్‌డీఎంఏ అప్‌డేట్! కవితా పఠనంతో సభను అలరించిన యువకవి నీలం గేదెల.. ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన డా. శైలేష్ వి. శ్రీఖండే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడమే నా కల.. 'పత్తా' బాల నటుడు సాయి పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! క్రిటికల్ కేర్ ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శ్రీశైలం గౌడ్ మరణం పార్టీకి తీరని లోటు వేటజంగాలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పూడి మంగ నామినేషన్.

బీసీలకే క్రిమిలేయర్‌ ఆంక్షలెందుకు?

Select Suryaa Now
బీసీలకే క్రిమిలేయర్‌ ఆంక్షలెందుకు?

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు బీసీలకు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న బీసీల సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు మాత్రమే క్రిమిలేయర్‌ నిబంధన విధించడం తీవ్ర వివక్షకు నిదర్శనమని పేర్కొంటూ, ఈ నిబంధనను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. క్రిమిలేయర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నప్పటికీ, 2015 నుంచి అమలైన నిబంధనల కారణంగా బీసీలకు జరిగిన అన్యాయాలను కూడా సరిదిద్దాలని సంఘాలు కోరుతున్నాయి. గత పదేళ్లలో క్రిమిలేయర్‌ కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, అర్హులైన వారికి తగిన పోస్టింగ్‌లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, వ్యవసాయ ఆదాయాన్ని క్రిమిలేయర్‌ ఆదాయంగా పరిగణించరాదని స్పష్టం చేసిన అంశాన్ని ప్రస్తావిస్తున్న బీసీ సంఘాలు.. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల వేతనాల విషయంలోనూ ఇదే విధానం వర్తించాలని కోరుతున్నాయి.

70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దూరం?

క్రిమిలేయర్‌ నిబంధనల వల్ల గత పదేళ్లలో లక్షలాది మంది బీసీ అభ్యర్థులు నష్టపోయారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత సర్వీసుల్లో ప్రతి ఏడాది 20 నుంచి 30 మంది వరకు బీసీ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొంటున్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా జరిగే నియామకాల్లోనూ సుమారు 70 వేల మంది బీసీ అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయని ఆరోపిస్తున్నాయి. గతంలో జరిగిన నియామకాల్లో క్రిమిలేయర్‌ కారణంగా అన్యాయానికి గురైన అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించి, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేస్తున్నాయి.

బీసీలకే ఈ వివక్ష ఎందుకు?

దేశంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎన్‌సీసీ, మహిళా రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్‌ నిబంధనను బీసీలకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు పాలనలో తగిన ప్రాతినిధ్యం కల్పించే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అని వివరిస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం లేని బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలు, అధికార వ్యవస్థల్లో భాగస్వామ్యం కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్నాయి.
ఉద్యోగాలు, అధికారంలో వాటా లభించినప్పుడే వెనుకబడిన కులాలకు సామాజిక గౌరవం పెరుగుతుందని, కుల వివక్ష తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని క్రిమిలేయర్‌ విధించడం వల్ల సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించే అసలు రిజర్వేషన్‌ లక్ష్యమే దెబ్బతింటోందని విమర్శిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన మండల్‌ కమిషన్‌తో పాటు దేశంలో ఇప్పటివరకు నియమితమైన బీసీ కమిషన్లు కూడా క్రిమిలేయర్‌ విధించాలని సిఫారసు చేయలేదని వారు వాదిస్తున్నారు. అందువల్ల బీసీ రిజర్వేషన్లకు విధించిన ఈ నిబంధనను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.

జనాభా దామాషా ప్రకారం హక్కులు కల్పించాలి

దేశ జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యాయని సంఘాలు విమర్శిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా బీసీలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా లెక్కల్లో సమగ్ర కులగణన నిర్వహించి, బీసీల వాస్తవ జనాభాను వెల్లడించాలని కోరుతున్నాయి. ఆ గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను పెంచి, అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కావాలి

బీసీల సామాజిక, రాజకీయ సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభలు, శాసనమండళ్లలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక బీసీ బిల్లు తీసుకురావాలని కోరుతున్నాయి. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు బీసీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి అనుగుణంగా బీసీలకు జరిగిన గత పదేళ్ల అన్యాయాలను సమీక్షించి సరిదిద్దడం, క్రిమిలేయర్‌ నిబంధనను తొలగించడం, రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని బీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నాయి. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలి.. బీసీలకు సమన్యాయం ఎప్పుడు దక్కుతుందో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.