ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి
రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సర్వీస్ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని గోరటి వెంకటేశం జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కనీస రహదారి భద్రతా సదుపాయాలు లేకపోవడంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డు మొత్తం చీకటిగా ఉంటోందని, వీధి దీపాలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.
అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు, వేగ పరిమితులు, పదునైన మలుపులు, దిశలను సూచించే హెచ్చరిక బోర్డులు చాలా చోట్ల కనిపించడం లేదన్నారు. ఉన్న బోర్డులు సైతం చెట్ల చాటున ఉండటంతో వాహనదారులకు అవి కనిపించడం లేదని తెలిపారు. దీంతో వాహనాల వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.
వెంటనే స్పందించాలి
ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో చీకటి ప్రాంతాలను గుర్తించి తగినన్ని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పాడైన హెచ్చరిక బోర్డులకు మరమ్మతులు చేసి, అవసరమైన చోట కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. చెట్ల చాటున ఉన్న సూచిక బోర్డులు వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఈ మార్గంలో ఇటీవల జరిగిన ప్రమాదాల వివరాలను వెల్లడించడంతోపాటు, ప్రమాదాలకు ప్రధాన కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని గోరటి వెంకటేశం డిమాండ్ చేశారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్