telangana
రైతు సంఘాలకు సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు - కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం
సూర్య, మందమర్రి: 2026-27 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఎస్ఎంఏఎం) ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీ హెచ్ సీ ఎస్) ఏర్పాటు చేసుకునేందుకు అర్హత కలిగిన రైతు సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి వెల్లడించారు. సోమవారం ఆమె ఒక ప్రకటనలో ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచి, చిన్న, సన్నకారు రైతులకు సైతం యంత్ర పరికరాలు అందుబాటులో ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా నమోదిత రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పి ఓ ఎస్), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసీఎస్), మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్ హెచ్ జి ఎస్) కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కేంద్రాల ఏర్పాటుకు అయ్యే అర్హత కలిగిన ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం రాయితీగా, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు. కిసాన్ డ్రోన్ కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీతో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన సంఘాలు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ వెబ్‌సైట్ https://agrimachinery.nic.in లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రాయితీలను వినియోగించుకొని వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను మరింత విస్తరించాలని, ఈ అవకాశాన్ని అర్హులైన సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కోసం మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.