BREAKING
వరుసగా మూడు గ్రామ పంచాయతీ సమావేశంలో గైర్హాజరు - 11వ వార్డు సభ్యుడికి అనర్హత నోటీసు ముంబైలో ఛఠ్ పూజ వేడుకల్లో తమన్నా భాటియా.. 'ది వాన్' పాటపై ఆసక్తికర మాటలు! ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌ సహా రెండు డజన్లకు పైగా కంపెనీలకు అమెరికా 'జాతీయ ఛాంపియన్‌' హోదా అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా -- సంక్షేమ పథకాలు అందిస్తున్నాం -- ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి 2001 గుజరాత్ భూకంపం తర్వాత కచ్ పునర్నిర్మాణ అద్భుతం రైతుల సంక్షేమమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం - వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ నేను నటినన్న విషయాన్ని పరిశ్రమ మర్చిపోయింది.. దర్శకత్వంపై కష్మీరా షా ఆసక్తికర వ్యాఖ్యలు! బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ స్థానిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన! అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యం - రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారత్‌లో పర్యటిస్తున్న బెలారస్ విదేశాంగ మంత్రి స్పీకర్ సూచించిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పనిచేయాలి రేకుర్తి 22ఏ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా భోగలింగేశ్వర దేవస్థానంలో నాగ జగదీష్‌కు సత్కారం. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి – ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతః మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతః మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో సోమవారం అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో నూతన పింఛన్ల లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి అక్కాచెల్లెళ్లను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వీరిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు, 53,844 మంది ఒంటరి మహిళలు ఉన్నారని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 5,230 మందికి, ఎల్కతుర్తి మండలంలో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న 5,850 మందికి అదనంగా మరో 715 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. పింఛన్ల పరిశీలనలో లోపాలు ఉన్నట్లయితే ప్రత్యేక అధికారులతో 380 కోణాల్లో పరిశీలన చేయాలని ఆదేశించామని, అర్హులైన ఒక్కరూ పింఛన్‌కు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, చేతికర్రలు, ఈవీ వాహనాలు, వినికిడి యంత్రాలు ఉచితంగా అందించేందుకు ఎల్కతుర్తిలో ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతుందని, 18 ఏళ్లు నిండిన కోటి మంది మహిళలకు చీరలు అందించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులతో పాటు అన్ని వృత్తుల వారికి ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వివరించారు. రాబోయే వేసవి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలని పొన్నం సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని, కాకతీయుల గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తితో గ్రామాల్లో ఊటకుంటలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు.
యువత గంజాయి, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో కోర్టులు, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు చిన్న గ్రామాలకు రూ.లక్ష, పెద్ద గ్రామాలకు రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. త్వరలో హుస్నాబాద్ కబడ్డీ అకాడమీ ప్రారంభిస్తామని చెప్పారు. ఎల్కతుర్తి చౌరస్తాను అభివృద్ధి చేశామని, త్వరలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపడతామని, ఎల్కతుర్తి ఆసుపత్రి విస్తరణతో పాటు మణికొండ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, తలసేమియా బాధితులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసి పంపిణీ ప్రారంభించామని తెలిపారు. ఈ విడతలో దాదాపు 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ మరో అవకాశం కల్పిస్తామని చెప్పారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న మరో 13 వేల మంది వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, తలసేమియా బాధితులైన పురుష పింఛనుదారులు మరణిస్తే వారి భార్యలకు ఒకటి రెండు నెలల్లోనే పింఛన్ మంజూరయ్యేలా కొత్త జీవో తీసుకొచ్చామని తెలిపారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటివరకు రూ.75 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని వివరించారు. ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు అందించడంతో పాటు వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి నేరుగా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకాలను కుటుంబంలోని మహిళల పేర్ల మీద అందిస్తున్నామని చెప్పారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు అక్షర జ్ఞానం అందించామని, ఆసక్తి ఉన్నవారికి పదో తరగతి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కిరాణా, బట్టల దుకాణాలు, మొబైల్ వాహనాల ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, బస్సుల నిర్వహణ వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామని, గత ఏడాది వాటి ద్వారా రూ.168 కోట్ల కమీషన్ ఆదాయం సంపాదించారని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా, కుటుంబ పెద్ద మరణిస్తే ఇందిరమ్మ జీవిత బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. హైటెక్ సిటీ సమీపంలో మహిళా ఉత్పత్తుల విక్రయాల కోసం రూ.1,000 కోట్ల విలువైన 106 దుకాణాలను కేటాయించామని, గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఇప్పటికే రూ.200 కోట్లు మంజూరు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని రోడ్లు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెను కోరారు.
చదువుతోనే పేదరికానికి దూరం
పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే ప్రధాన మార్గమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆస్తులు, కులం అండ లేకపోయినా చదువుతో ఉన్నతాధికారులుగా ఎదగవచ్చని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. పెద్దలను గౌరవించడం, మంచి విలువలు అలవర్చుకోవడం చిన్నతనం నుంచే నేర్పించాలని పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.