ముంబైలో ఛఠ్ పూజ వేడుకల్లో తమన్నా భాటియా.. 'ది వాన్' పాటపై ఆసక్తికర మాటలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటి తమన్నా భాటియా ఇటీవల ముంబైలో జరిగిన ఛఠ్ పూజ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులతో కలిసి వేడుకల్లో సందడి చేసిన ఆమె, అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తమన్నా నటించిన ది వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ చిత్రంలోని ఛఠ్ పూజ సన్నివేశం, పాటకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన నేపథ్యంలో ఈ వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. ముంబై ఉత్సవాల వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన తమన్నా, ఛఠీ మైయా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
ది వాన్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అందులోని ఛఠ్ పూజ పాట మాత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. విశాల్ మిశ్రా స్వరపరిచి, కౌశల్ కిషోర్ సాహిత్యం అందించిన ఈ గీతం అనేక మందికి పండుగ జ్ఞాపకాలను, సంప్రదాయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిందని అభిమానులు పేర్కొన్నారు. ఈ సన్నివేశం చిత్రీకరణకు ముందు ఛఠ్ పూజ విశిష్టత, బిహార్, పాట్నాలో ఈ పూజను ఎలా నిర్వహిస్తారనే విషయాలను లోతుగా అధ్యయనం చేశానని తమన్నా గతంలో ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. ఛఠీ మైయాతో తనకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని, ఈ పండుగ అంశాన్ని అనుభవపూర్వకంగా తెరకెక్కించడం ఆనందంగా ఉందని తెలిపారు.
మరోవైపు సినిమా విడుదలైన తొలినాళ్లలో ది వాన్ చిత్రంపై వచ్చిన విమర్శలు, అంచనాల గురించి హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల ఓ షోలో స్పందించారు. మన సంస్కృతి, మూలాలతో ముడిపడిన కథలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని, రచన, నటన, సన్నివేశాల పరంగా ది వాన్ ఆ వర్గానికి సరిగ్గా సరిపోయేలా రూపొందిందని ఆయన అభిప్రాయపడ్డారు.
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ది వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియాతో పాటు శ్వేతా తివారీ, సునీల్ గ్రోవర్, అనూప్ సోనీ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిహార్‌లోని బిహ్తా వనదేవి ఆలయ జానపద కథాంశం, ఛఠ్ పూజ ఆధ్యాత్మిక నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.