telangana
వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ
సూర్య, ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి సీజన్‌లో పంటల వైవిధ్యీకరణ, నీటి వనరుల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సీజన్‌లో వర్షపాతం తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టాలు పడిపోయి సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అధిక నీటి అవసరమయ్యే వరి సాగును తగ్గించి, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. శనగ, పెసర, మినుము, కుసుమ, జొన్న, నువ్వులు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుతో భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని వివరించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా నీటి పొదుపుతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చన్నారు. రైతులు భూమి స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.అనంతరం కమ్మర్‌పల్లి పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త విద్య మాట్లాడుతూ పసుపు సాగులో సేంద్రియ వ్యవసాయ ప్రాధాన్యతను వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణహిత సాగు పద్ధతులను అలవర్చుకోవాలని రైతులకు సూచించారు.ఉద్యానవన అధికారి సంధ్య మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు, పంటల వైవిధ్యీకరణ, సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరికృష్ణ, పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త విద్య, ఉద్యానవన అధికారి సంధ్య, AEO రమ్య, గ్రామ సర్పంచ్ దేవేందర్, ఉపసర్పంచ్ తుకారం, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.