telangana
- సర్వే నంబర్ 401 భూములు నిషేధిత జాబితాలోనే - భూములున్నా హక్కులు లేవు.. అమ్ముకోలేరు.. కొనలేరు..!
సూర్య, ఆర్మూర్ : భూములు ఉన్నా వాటిని అమ్ముకోలేక.. అవసరమైతే ఇతరుల నుంచి కొనుగోలు చేయలేక ఆర్మూర్ యానంగుట్ట శివారు రైతులు ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని యానంగుట్ట శివారు పరిధిలో గల సర్వే నంబర్ 401 భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయవిక్రయాలు, భూ బదలాయింపులకు అవకాశం లేకుండా పోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాకు వినతిపత్రం సమర్పించారు.ఈ సమస్యపై గతంలో పలుమార్లు సబ్ కలెక్టర్‌తో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని రైతులు తెలిపారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్లకు మూడుసార్లు వినతిపత్రాలు అందజేసి తమ సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వాపోయారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యకు మోక్షం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సర్వే నంబర్ 401 భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని, భూములను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి, ఇతరులకు బదలాయించడానికి వీలుకావడం లేదని పేర్కొన్నారు. దీంతో అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినా తమ సొంత భూములను ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొందన్నారు.
కలెక్టర్ చొరవతోనైనా సమస్యకు మోక్షం కల్పించాలి.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సర్వే నంబర్ 401 భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులతో విచారణ జరిపించి, నిషేధిత జాబితాలో భూములు చేరడానికి గల కారణాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హమైన భూములను జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఈ సమస్యపై సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా స్పందించి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.