రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
సూర్య- బిక్కనూర్ : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. సోమవారం మండలంలోని పెద్దమల్లారెడ్డి పిఎసిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులకు అండగా పిఎసిఎస్ లు పనిచేయాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు సకాలంలో అందేలా పిఎసిఎస్ లు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సహకార సంఘాలు కేవలం రుణాల పంపిణీకే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించే సమగ్ర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అంతకుముందు సొసైటీ చైర్మన్ గా సురేందర్ రెడ్డి తోపాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు సుధాకర్ రెడ్డి, భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీపీలు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు