ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 99వ అకాడమీ అవార్డులకు భారత అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం గోంధాల్ ఎంపికైన తర్వాత తనకు విపరీతమైన ఆందోళన కలిగిందని, నిద్ర పట్టక వైద్యుడిని సంప్రదించాల్సి వచ్చిందని ఆ చిత్ర దర్శకుడు సంతోష్ దవాఖర్ వెల్లడించారు. ఆస్కార్ ప్రకటన వెలువడిన వెంటనే అభినందనలతో పాటు సాంకేతిక నిబంధనలు, సబ్మిషన్లు, ఇతర ప్రక్రియలకు సంబంధించి నిరంతరాయంగా ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయని తెలిపారు. తక్కువ సమయంలోనే ఆ పనులన్నీ పూర్తి చేయాల్సి రావడంతో ఒత్తిడి పెరిగిందని, తన తొలి సినిమాతోనే ఈ ప్రయాణం కొత్త అనుభవాలను నేర్పిస్తోందని చెప్పారు. అధికారిక ప్రకటనకు రెండు రోజుల ముందే తన చిత్రం ఎంపికవుతుందన్న బలమైన నమ్మకం కలిగిందని, అందుకే ఆరు నెలల పాటు ఓటీటీలో విడుదల చేయబోమని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు.
అంతర్జాతీయ వేదికలపై గోంధాల్ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని సంతోష్ దవాఖర్ పేర్కొన్నారు. లండన్, మాంచెస్టర్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించగా, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ ప్రేక్షకులు సినిమాలోని పాత్రలు, కథన శైలిపై లోతైన ప్రశ్నలు అడిగారని వివరించారు. బాలీవుడ్ సినిమాలను కాదని భారత్ ఈ చిత్రాన్ని ఎందుకు ఎంపిక చేసిందో ప్రదర్శన చూశాక వారికి అర్థమైందని, తమ వద్ద బలమైన కంటెంట్ ఉందన్న నమ్మకం మరింత పెరిగిందని అన్నారు. మరాఠీ చిత్రం గోంధాల్‌తో పాటు నాగాలాండ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆంగ్ చిత్రం కూడా ఈ ఏడాది అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున పోటీలో ఉన్నాయని, ఈ రెండింటిలో ఏదో ఒకటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ నుంచి జితేంద్ర జోషి, మధుర్ భండార్కర్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు సినిమా చూసి ప్రశంసించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.
మరాఠీ సినిమా ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందిస్తూ, మంచి కంటెంట్‌కు మరాఠీ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పెట్టింది పేరని, గుజరాత్, రాజస్థాన్ ప్రేక్షకులు కూడా మరాఠీ సినిమాలను ఆదరిస్తున్నారని సంతోష్ చెప్పారు. అయితే మరాఠీ ప్రేక్షకులు హిందీ సినిమాలను థియేటర్లలో చూస్తూ, మరాఠీ చిత్రాలను మాత్రం ఓటీటీలో చూడటానికి మొగ్గు చూపడం వల్ల బాక్సాఫీస్ వసూళ్లు, నిర్మాణ బడ్జెట్‌లపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా విజయవంతమైతే అదే ఫార్ములాతో పదుల సంఖ్యలో సినిమాలు తీసే ధోరణి మారుతోందని, రాజా శివాజీ, దేవ్‌మానస్ 2, దశావతార వంటి విభిన్న చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం శుభపరిణామమని చిత్రబృందం అభిప్రాయపడింది.
సంప్రదాయ అర్ధరాత్రి ఆచారాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన గోంధాల్ చిత్రానికి సంతోష్ దవాఖర్ రచన, దర్శకత్వం వహించారు. 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, 33 చిత్రాలతో పోటీపడి 2027 ఆస్కార్స్‌కు భారత ఎంట్రీగా నిలిచింది. ఇషితా దేశ్‌ముఖ్, కిషోర్ కదమ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆస్కార్ ఎంపిక తర్వాత మళ్లీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.