రావణాసురుడు ఒరిజినల్ టెక్ బ్రో.. టెక్ బిలియనీర్లతో పోల్చిన ట్వింకిల్ ఖన్నా!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నటి నుంచి రచయితగా మారిన ట్వింకిల్ ఖన్నా తన నిక్కచ్చి మాటలు, వ్యంగ్య శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రణబీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రామాయణ చిత్రం నేపథ్యంలో రావణాసురుడిని ఆమె ప్రస్తుత టెక్ బిలియనీర్లతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా కాలమ్‌లో రావణుడిని ఒరిజినల్ టెక్ బ్రోగా అభివర్ణించిన ట్వింకిల్ ఖన్నా, అతని వ్యక్తిత్వం, విధానాలను నేటి బడా టెక్నాలజీ దిగ్గజాలతో పోల్చిచూశారు.
రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ గతంలో ఎలాన్ మస్క్ టెస్లా రోడ్‌స్టర్ కారు, రావణుడి పుష్పక విమానం గురించి చేసిన వ్యాఖ్యలను ట్వింకిల్ ఖన్నా ప్రస్తావించారు. ఐదు వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఎగిరే వాహనం ఉండేదని రణబీర్ చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని, ఒరిజినల్ టెక్ బ్రోకి రావణుడు ఒక బ్లూప్రింట్ లాంటివాడని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కొందరు వ్యాపారవేత్తల వ్యక్తిగత జీవిత వివాదాలు, అఫైర్ల ఆరోపణలను రావణుడితో పోలుస్తూ చురకలు అంటించారు.
మూడు దశాబ్దాలకు పైగా తాను నిర్మించిన సంస్థ నుంచి అఫైర్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వైదొలగాల్సి వచ్చిన పరిస్థితిని, అలాగే వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో బిల్ గేట్స్ ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె ఉదాహరణలుగా చూపారు. అపారమైన జ్ఞానం, సంపద, శక్తితో పాటు అద్భుతమైన సాంకేతికత అందుబాటులో ఉన్న రావణుడు, ఇతరులకు వర్తించే నియమాలు తనకు వర్తించవని భావించేవాడని ట్వింకిల్ ఖన్నా రాశారు. అమరత్వంపై వ్యామోహం, నిబంధనలను అతిక్రమించే ధోరణి అతనిని నేటి టెక్ దిగ్గజాలకు దగ్గరగా నిలుపుతాయని విశ్లేషించారు.
రావణుడికి లెదర్ జాకెట్, పది తలలకు ఒక్కో డివైజ్, సిలికాన్ వ్యాలీ ప్రధాన కార్యాలయం, సొంత పాడ్‌కాస్ట్ ఉంటే ఇవాల్టి టెక్ ప్రపంచంలో సులభంగా కలిసిపోతాడని ట్వింకిల్ ఖన్నా చమత్కరించారు. ప్రపంచాన్ని జయించే తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ, నేటి శక్తివంతమైన వ్యక్తుల మాదిరిగానే రావణుడు కూడా తన మనసును అదుపులో ఉంచుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన రామాయణ తొలి భాగం నవంబర్ 5న విడుదల కాగా, రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ విధ్వంసం.. 11 రోజుల్లో రూ.1,384 కోట్లతో పలు రికార్డులు బద్దలు!