నటుడు శరద్ కపూర్‌ను కలిసిన సోనూసూద్.. అనారోగ్య పరిస్థితిపై ఆరా!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ నటుడు శరద్ కపూర్ తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని భావోద్వేగంగా విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే నటుడు సోనూసూద్ ఆయనను కలిసి పరామర్శించారు. ముంబైలో వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శరద్ కపూర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సోనూసూద్, కాలి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తర్వాత, వాకింగ్ ఫ్రేమ్ సహాయంతో నడుస్తున్న శరద్ కపూర్‌ను సోనూసూద్ ఆయన నివాసం వరకు సాగనంపారు. శరద్ కపూర్‌కు అవసరమైన వైద్య సామగ్రిని కూడా సోనూసూద్ సమకూర్చారని, ఆయన పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
ఇటీవల తన నాలుగు పెంపుడు కుక్కలను ఒక జంతు సంక్షేమ కేంద్రానికి అప్పగిస్తున్న వీడియో వైరల్ కావడంతో శరద్ కపూర్ వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాల వల్ల వాటిని తాను చూసుకోలేకపోతున్నానని ఆ వీడియోలో ఆయన పేర్కొన్నారు. శరద్ కపూర్ గత రెండేళ్లుగా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, మెదడుకు సంబంధించిన సమస్యతో పాటు కాలు విరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన స్నేహితురాలు హేమ చౌదరి వెల్లడించారు.
అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసిన శరద్ కపూర్, తనకు ఆర్థిక సాయం కంటే పని కావాలని, సీనియర్ నటులు, పరిశ్రమ పెద్దలు అండగా నిలవాలని కోరారు. డిప్రెషన్‌తో పోరాడుతున్నానని, తనకు నైతిక మద్దతు, మంచి అవకాశాలు కావాలని, తిరిగి నటన ప్రారంభించాలనేదే తన ప్రధాన కోరిక అని ఆవేదన వ్యక్తం చేశారు. సింటా సంస్థ కూడా తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మేరా ప్యారా భారత్ చిత్రంతో 1994లో కెరీర్ ప్రారంభించిన శరద్ కపూర్, స్వాభిమాన్ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందారు. తమన్నా, త్రిశక్తి, జోష్, ఆఘాజ్, ఖౌఫ్, హత్యార్, జానీ దుష్మన్, ఎల్‌ఓసీ కార్గిల్, లక్ష్య వంటి పలు చిత్రాల్లో నటించిన ఆయన చివరిసారిగా 2019లో వచ్చిన క్యాబరే సినిమాలో కనిపించారు. కష్టకాలంలో శరద్ కపూర్‌కు సోనూసూద్ అండగా నిలవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్