క్రిటికల్ కేర్ ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి భవనంలోని వివిధ విభాగాలు, గదులను పరిశీలించిన కలెక్టర్.. చిన్నచిన్న మరమ్మతు పనులు, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవన వినియోగానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.
క్రిటికల్ కేర్ ఆసుపత్రికి రోగులు, అంబులెన్సులు, వైద్య సిబ్బంది సులభంగా చేరుకునేందుకు అప్రోచ్ రోడ్డు అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని టీఎస్ఎంఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
క్రిటికల్ కేర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గేలా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు సమకూర్చి త్వరితగతిన సేవలు ప్రారంభించాలని సూచించారు.
టీఎస్ఎంఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ రోహిత్, టీఎస్ఎంఐడీసీ డీఈ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్: