telangana
వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక
సూర్య, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని శ్రీనిత్య వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. చిన్న వయస్సులోనే క్రీడారంగంలో ప్రతిభ చాటుతూ పాఠశాలకు గుర్తింపు తీసుకురావడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నవంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన అండర్-14 (యు-14) రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీల్లో శ్రీనిత్య పాల్గొని తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది.ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పుష్పగుచ్ఛం అందించి ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. శ్రీనిత్యలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు.