telangana
నోటీసులు ఇవ్వకుండానే షాపు కూల్చివేత.. రూ.6 లక్షల నష్టం! • ప్రజావాణిలో బాధితుడి ఆవేదన
సూర్య, లక్షెట్టిపేట : రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తన షాపును కూల్చివేశారని, దీంతో సుమారు రూ.6 లక్షల మేర నష్టపోయానని లక్షెట్టిపేట పట్టణం బీట్ బజార్, 14వ వార్డుకు చెందిన పాలకుర్తి అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టిన సమయంలో ఆరు నెలల క్రితమే తన షాపును కూల్చివేశారని తెలిపారు. షాపు కూల్చివేయడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నానని వాపోయారు. కనీసం కూల్చివేతకు సంబంధించిన శిథిలాలను సైతం తొలగించకుండా అలాగే వదిలేశారని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్‌కు దరఖాస్తు అందజేశారు. తనకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని, షాపు కూల్చివేతకు పరిహారం చెల్లించడంతో పాటు శిథిలాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.