నేటి ప్రజావాణికి 78 దరఖాస్తులు -బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
బాలల హక్కుల వారోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి మందిరంలో సోమవారం ప్రత్యేకంగా నిర్వహించిన బాలల ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు విద్య, వైద్యం, రవాణా తదితర సమస్యలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వివరించి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బల్మూరు, తిమ్మాజీపేట, బిజినపల్లి, తాడూరు మండలాలకు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులు పండుగలు, సెలవు రోజుల్లో స్వగ్రామాలకు వెళ్లేందుకు, తిరిగి పాఠశాలలకు చేరుకునేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి అవసరమైన బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తండ్రిని కోల్పోయిన ముగ్గురు బాలికలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి, ఉన్నత విద్యను కొనసాగించేందుకు ప్రభుత్వపరంగా సహాయం అందించాలని కోరారు. వారి పరిస్థితిని పరిశీలించి, అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, ఇతర సహాయ అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మరో వినతిలో ఆరు నెలల చిన్నారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తల్లి కలెక్టర్‌కు తెలిపింది. వెంటనే స్పందించిన కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణకు ఫోన్ చేసి చిన్నారికి అవసరమైన వైద్య పరీక్షలు, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వపరంగా భరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పిల్లల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమస్యలను సత్వరం పరిష్కరించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను పాఠశాలలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులకు అందజేస్తే వాటిని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణి, మండల ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ బాధితులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, కలెక్టరేట్ పరిపాలన అధికారి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి ,నాగర్‌కర్నూల్, రూరల్, సూర్య న్యూస్