సాయంత్రం కోర్టుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
సాయంత్రం కోర్టుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
కొత్త కోర్టులు ఏర్పాటు చేసి, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలి
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-న్యాయస్థానాల్లో పెరుగుతున్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు సాయంత్రం కోర్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ, న్యాయవాది మెట్టెల ఆంజనేయులు డిమాండ్ చేశారు.
సాయంత్రం కోర్టుల ఏర్పాటు వల్ల న్యాయవ్యవస్థలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులపై అదనపు పని గంటల భారం మోపడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించాలంటే జనాభా, కేసుల సంఖ్య, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా కొత్త న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు, అవసరమైన చోట అదనపు పోస్టులను మంజూరు చేసి నియామకాలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా కోర్టుల్లో సరిపడా కోర్టు హాళ్లు, సిబ్బంది, ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించాలని, మహిళా న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతో పాటు సామాన్య ప్రజలకు న్యాయం సులభంగా అందేలా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం, న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మెట్టెల ఆంజనేయులు కోరారు. అదనపు పని గంటల విధానాల కంటే కొత్త కోర్టుల ఏర్పాటు, న్యాయమూర్తుల నియామకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
“సాయంత్రం కోర్టులు వద్దు.. కొత్త కోర్టులు కావాలి.. అదనపు పని గంటలు కాదు.. న్యాయవ్యవస్థకు అదనపు వనరులు కావాలి” అనే నినాదంతో న్యాయవాదుల హక్కులను, న్యాయవ్యవస్థ గౌరవాన్ని, ప్రజల న్యాయ హక్కులను కాపాడేందుకు న్యాయవాదులందరూ ఐక్యంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాలని మెట్టెల ఆంజనేయులు పిలుపునిచ్చారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా