సంజీవని’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 16:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంజీవని’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వైద్యాధికారులను ఆదేశించారు..
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంజీవని కార్యక్రమం లక్ష్యాల అమలు, వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సమన్వయం, ఆరోగ్య సేవల పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ‘సంజీవని’ కార్యక్రమాని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు నిరంతర వైద్య సేవలు అందించడం, రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేయడం, రోగుల ట్రాకింగ్, వివిధ స్థాయిల ఆరోగ్య కేంద్రాల మధ్య సమన్వయం, సకాలంలో ఫాలోఅప్ సేవలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమన్నారు. ‘సంజీవని’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా వైద్య అధికారులు, వైద్య సిబ్బందికి సామర్థ్య పెంపు, శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్ వైద్య అధికారులకు సూచించారు.
కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని మిత్రలను నియమించి, వారికి విధులు, బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ పోస్టులను సంజీవని మిత్రలుగా పునర్నిర్వచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి అవసరమైన శిక్షణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు.
ప్రతి రోగికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కల్పించడం సంజీవని కార్యక్రమంలో కీలకమైన అంశమని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 99.3 శాతం మేర OP రిజిస్ట్రేషన్, ABHA ఐడీ జనరేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసి 100 శాతం సాధించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. రోగికి సంబంధించిన గత వైద్య చరిత్ర, పరీక్షల నివేదికలు, తీసుకున్న చికిత్సలు, మందుల వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా అవసరమైనప్పుడు ఏ వైద్య కేంద్రంలోనైనా ఆ వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి వైద్య పరీక్షలు, ల్యాబ్ నివేదికలు, వైద్యుల సూచనలు, మందుల వినియోగం వరకు ప్రతి దశను డిజిటల్ విధానంలో నమోదు చేయాలన్నారు. వైద్య సేవలు పొందిన అనంతరం కూడా ఫోన్ కాల్స్ ద్వారా రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ నిరంతర ఫాలోఅప్ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటి సందర్శనలు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, తీవ్రమైన రక్తహీనత, కవల గర్భధారణ వంటి హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లు, శిశువు కదలికలు తదితర అంశాలపై క్రమం తప్పకుండా ఆరా తీస్తూ అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవల మధ్య సమన్వయం బలోపేతం చేయాలన్నారు. సాధారణ వ్యాధులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్యం అందించి, సంక్లిష్టమైన కేసులను అవసరాన్ని బట్టి ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ వైద్య సేవలు అందేలా రిఫరల్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
టెలిమెడిసిన్, ఇ-సంజీవని వంటి డిజిటల్ వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా నిపుణులైన వైద్యుల సలహాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల రోగులకు ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు సకాలంలో పొందే అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్ వైద్య సేవల అమలులో రోగుల వ్యక్తిగత సమాచార గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత వంటి అంశాలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
సంజీవని కార్యక్రమం సమర్థవంతమైన అమలుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, వివిధ వైద్య విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్ తెలిపారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలకు సమగ్ర, నాణ్యమైన, నిరంతర వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సమావేశంలో డి ఎమ్ హెచ్ ఓ డా.కామేశ్వర ప్రసాద్, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డా.భాస్కర్,, డి సి హెచ్ ఎస్ డా.జాఫ్రుల్లా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, రాష్ట్రీయ స్వాత్స్య కో ఆర్డినేటర్ హేమలత, జిల్లా ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అష్ఫాక్, పూజిత, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.