అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం.
సూర్య న్యూస్ అద్దంకి.
పెరిగిన బియ్యం ధరల నుండి పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన ధరణి బియ్యాన్ని అందిస్తోందని నాగులపాడు సహకార సంఘం అధ్యక్షులు ఏనుగంటి వెంకటరామయ్య (బాబు) తెలిపారు. సోమవారం నాగులపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో ధరణి బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ కాకాని అశోక్ మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు లేక రైతులు పంటలు వేయలేని పరిస్థితి నెలకొనడంతో మార్కెట్లో బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ దొరికే నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం సహకార సంఘం అధ్యక్షులు వెంకటరామయ్య మాట్లాడుతూ, బియ్యం అవసరమైన వారు తమ ఆధార్ కార్డుతో నాగులపాడు సహకార సంఘం వద్దకు వచ్చి 26 కేజీల బియ్యం బస్తాను కేవలం 1300 రూపాయలకే పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు సందిరెడ్డి రమేష్, మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, సొసైటీ సీఈవో శివరామకృష్ణ, 31 వ వార్డు కౌన్సిలర్ గోవిందు మరియు స్థానిక రైతులు, ప్రజలు పాల్గొన్నారు.