పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత రెండో రోజు నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లోని కొత్తూరు, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేబాక గ్రామ పంచాయతీ కార్యాలయాలలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులను, వారికి మద్దతు తెలుపుతున్న మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నారు. తనిఖీలలో భాగంగా సిబ్బందికి, అధికారులకు జిల్లా ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ ఒకేసారి రాకుండా వారికి వేర్వేరు సమయాలు కేటాయించేలా చూడాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు, కార్యకర్తలు గుమికూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. తనిఖీలలో అనకాపల్లి రూరల్ సీఐ అశోక్ కుమార్, అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్ఐలు రవికుమార్, వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ నాగు యన్ంశెట్టి, అనకాపల్లి.