పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి
--పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు
--ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు..
--అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి
వైరా రూరల్ (సూర్య న్యూస్):-
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు వైరా మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ చూపారు. మండలంలోని సిరిపురం, గరికపాడు, గన్నవరం, పాలడుగు, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి గ్రామాల్లో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైరా మండల అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులందరూ ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరగాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడం అవసరమని పేర్కొన్నారు.
గ్రామాల్లోని పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఓటు నమోదు కోసం పట్టభద్రులు ముందుకు రావాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైరా మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు), పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.