వికారాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్
వికారాబాద్, మేజర్ న్యూస్: వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రూ.2 వేల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు వికారాబాద్ మండల పరిధిలోని పిరంపల్లి, పులుసుమామిడి, సిద్ధులూరు గ్రామాల్లో రైతు సంఘం జిల్లా బృందం పర్యటించి పంట నష్టాలను పరిశీలించింది.ఈ సందర్భంగా ఆర్. మహిపాల్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, బోర్లలో నీటి కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పత్తి, వరి, కంది పంటలతో పాటు క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ తదితర కూరగాయల పంటలు, పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని కోరారు.నష్టపోయిన పత్తి, వరి, కంది రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున, కూరగాయల పంటలు సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకు పంటల బీమా పరిహారంతో పాటు బోనస్‌లు చెల్లించాలని, బ్యాంకు రుణాలను రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ స్పందించి వికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని ఆర్. మహిపాల్ విజ్ఞప్తి చేశారు.ఈ పర్యటనలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇందురూపాటి గోపాల్‌రెడ్డి, తేజబాయి శ్రీనివాస్‌తో పాటు రైతులు అశోక్, వేణుగోపాల్, సత్యమ్మ, నర్సమ్మ, వెంకటమ్మ, సుక్కమ్మ, శాంతమ్మ, లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.